Tribute to the legendary singer K.L. Saigal on his death anniversary. My pencil sketch.
మంచుపర్వతాల మీద సాగిపోయే ఒక మనోహర స్వర జలపాతం కె. ఎల్. సైగల్. తాను బతికింది నాలుగు దశాబ్దాలే అయినా, తన విలక్షణ గానంతో కోట్లాది సంగీత ప్రేమికుల్ని మంత్రముగ్ధుల్ని చేశారాయన. తొలిరోజుల్లో రఫీ, ముకేశ్, కిశోర్ ఆయనను అనుకరించడానికి సిద్ధమైనవారే. ‘జబ్ దిల్ హీ టూట్ గయా’ అనే పాట సైగల్ గళ
విశేషానికి ఒక మచ్చు తునక. ‘శాజహాఁ’ సినిమా కోసం మజ్రూహ్ సుల్తాన్‌పురి రాసిన ఈ గీతాన్ని నౌషాద్ స్వరపరిస్తే, సైగల్ తన గాన వైదుష్యంతో ప్రాణం పోసిన వైనాన్ని మరోసారి మనసారా వినండి...
జబ్ దిల్ హీ టూట్ గయా, హమ్ జీ కే క్యా కరేంగే
జబ్ దిల్ హీ టూట్ గయా....
(మనసే విరిగిపోయాక . నేను జీవించి మాత్రం ఏం చేస్తాను?
మనసే విరిగిపోయాక....)
జీవితంలో ఎన్ని సమకూర్చుకున్నా, ఏం సంపాదించుకున్నా, హృదయ నావలోకి వాటన్నిటినీ చేర్చుకుని హాయిగా సాగిపోవాలని కదా మనిషి ఆశ! లాహిరి లాహిరి లాహిరిలో అంటూ లోకాన్నే మరిచిపోయి ఓలలాడాలని కదా! కానీ, ఆ సమస్తాన్నీ సాకల్యంగా స్వీకరించే హృదయమే తునాతునకలైపోతే, ఇంక జీవితం ఏముంటుంది? జీవితాపేక్ష ఏముంటుంది. అందుకే, ఇంక బతికుండి మాత్రం ఏంచేస్తామనిపిస్తుంది? సరిగ్గా అదే సమయంలో ఒక్కోసారి ఏ ఓదార్పో, ఏ ఆధారమో లభించి హృదయంలో కొత్త ఆశలు మోసెత్తవచ్చు. జీవితం కొత్తగా చిగురించనూ వచ్చు. కాకపోతే ఆ పరిణామాలేవో చోటు చేసుకునేదాకానైతే, ఏముందిలే జీవితం అనిపిస్తుంది. జీవించడంలో అర్థమే లేదనిపిస్తుంది.
ఉల్ఫత్ కా దియా హమ్‌నే,, ఇస్ దిల్ మే జలాయా థా
ఉమ్మీద్ కే ఫూలోఁ సే ఇస్ ఘర్ కో సజాయా థా
ఇక్ భేదీ లూట్ గయా, హమ్ జీ కే క్యా కరేంగే /జబ్ దిల్ హీ/
(ప్రేమ జ్యోతిని నేనీ హృదయంలో వెలిగించాను
ఆశలపూలతో ఈ ఇంటిని అలంకరించాను. కానీ, అయినవారే ఒకరు అంతా కొల్లగొట్టేశారు. నేనింక బతికుండి మాత్రం ఏం చేస్తాను?)
ఏళ్ల పర్యంతంగా రకరకాల చీకట్లలో మ్రగ్గిన హృదయ నావలోకి ఏ ఒక్క కాంతి కిరణం చొరబడినా ఒక పండగే అనిపిస్తుంది. అలాంటిది కోటి దివ్వెల కాంతితో తనరారుతూ తన హృదయ వేదికమీద కదలాడిన ప్రేమను చూస్తే ఏం చేస్తారు? ఆ ప్రేమనొక అఖండ జ్యోతిగా జీవన లోగిలిలో దేదీప్యమానంగా వెలిగించుకుంటారు. ఆ లోగిలినే కాదు మొత్తం భవనాన్నే అనంతమైన ఆశా పుష్పాలతో అలంకరించుకుంటారు. కానీ, అప్పటిదాకా తనవారే అనిపించిన వ్యక్తే తన లోకాన్ని ధ్వంసం చేసేస్తే ఇంకేముంది? కళ్లముందే అంతా కకావికలమై, జీవన వ్యవస్థ అంతా తునాతునకలైపోతుంది. ఆ శిధిలాల కిందినుంచి లేవడం ఇక ఎప్పటికీ సాధ్యం కాదనిపించినప్పుడు ఇంక జీవించడంలో ఏ అర్థమూ లేదనిపిస్తుంది.
మాలూమ్ నా థా ఇత్‌నీ ముష్కిల్ హైఁ మేరీ రాహేఁ
ముష్కిల్ హై మేరీ రాహేఁ
అర్మాన్ కే బహేఁ ఆసూ, హస్‌రత్ నే భరీ ఆహేఁ
హర్ సాథీ ఛూట్ గయా హమ్ జీ కే క్యా కరేంగే / జబ్ దిల్ హీ /
(నా దారులు ఇంత కఠినతరమని తెలియదు నాకు
ఆశల కన్నీళ్లు పారాయి, ఆకాంక్షలు దారుల్లో నిట్టూర్పులే నింపాయి
ప్రతి మిత్రుడూ వెళ్లిపోయాడు.. నేనింక బతికుండి మాత్రం ఏం చే స్తాను?)
తాము నడిచి వెళ్లే దారిలో ఎన్నెన్ని బాధలు ఉంటాయో ఎలప్రాయంలో ఎవరికీ ఏమీ తెలియదు. అందుకే ప్రతి విఘాతానికీ హృదయం విలవిల్లాడుతుంది. ఆశలన్నీ కన్నీటిమయం అవుతున్నప్పుడు, ఆకాంక్షలన్నీ నిట్టూర్పుల మయం అవుతున్నప్పుడు జీవితం శోక సముద్రమే అవుతుంది. ఇతరమైన ఐశ్వర్యాలూ, ఆనందాలూ ఎన్ని పోయినా, కనీసం స్నేహితులైనా కడదాకా మనతో ఉండిపోవాలని కోరుకుంటాం.. కానీ, ఆ స్నేహితులు కూడా దూరమైపోతే, జీవించడంలో అర్థమేం కనిపిస్తుంది. కాకపోతే ఒక చోట హృదయం ముకుళించుకుపోతే మరోచోట అది వికసిస్తుంది. ఒక చోట ప్రాణరహితంగా కనిపించే హృదయమే ఒకచోట అనంతమమైన చైతన్యంతో తొణకిసలాడుతుంది. ఈ నిజాన్నే మనం తరుచూ విస్మరిస్తూ ఉంటాం. అడుగడుగునా అంతులేని నైరాశ్యానికి లోనవుతాం. నిజానికి అన్నీ తెలిసిన ఆత్మ ఘటనాఘటనాలకు అతీతంగా సాగిపోతూనే ఉంటుంది. సుఖదుఃఖాలకు అతీతంగా జీవనయానాన్ని
కొనసాగిస్తూనే ఉంటుంది.
(ఆంధ్రజ్యోతి 19th జనవరి 2016 సౌజన్యం తో)
it is really difficult to be a popular actor and also a very good singer , specially when the technology was not very strong as today , a great person . Unfortunately we lost him early . great voice , each if his songs are classics . we csn not select thus or that , baabul mora , do nayna , ek bangla bane .........list is fabulous . thank you for remembering this great personality .
ReplyDeleteVery true
Deletenice tribute...nice drawing.
ReplyDeleteThank you
Delete